BIBLE SERMONS by PASTOR NAKKOLLA BALASUBRAMANYAM

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

*మాటిమాటికి అడిగే ప్రార్ధన*

అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలన నైనను అతనికి కావలసినవన్నియు ఇచ్చును.
                  లూకా 11:8

ఇది మన జీవితంలో అత్యవసరమైన విషయాలను గురించి ప్రార్ధించే విధానం.

మాటి మాటికి అడగడం ఎందుకు? ఆయనకు గుర్తుండదా? అందరి ప్రార్ధనలు విని, ఎవరు ఏమి అడిగారో కన్ఫ్యూజ్ అయిపోతాడా? లేకపొతే, ఆయనకు అడిగించుకోవడం సరదానా? ఇవేమి కాదు.

నీవు అడిగేది నీకు ఎంత అవసరమో? తెలుసుకోవడానికి నిన్ను అడగమంటున్నాడు.

మా బాబు ఫ్లైట్ చూస్తే అది కొనమంటాడు. రేపు కొంటాము అంటే? సరేనంటాడు. మరళా రేపు దాని ప్రస్తావన వుండదు. కాని, కొన్ని వాడికి బాగానచ్చినవి వుంటాయి. రేపు అంటే? రేపు తప్పకుండా అడుగుతాడు. అట్లా వాటిని కొనేవరకూ అడుగుతూనే ఉంటాడు. అవసరమైతే ఏడ్చి మరీ కొనిపించుకుంటాడు.

మనము కూడా అనేక సందర్భాలలో ఇట్లానే ఏదో ఒక రాయివేసి చూద్దాం అన్నట్లు ఒకసారి ప్రార్ధించి విడచిపెట్టేస్తాం. ఎందుకంటే అవి కూడా మనకు అంత అవసరం కాకపోవచ్చు.

అయితే, కొన్ని విషయాలు మన జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనవి. వాటిని అట్లా ఒకటి, రెండుసార్లు ప్రార్ధించి విడచిపెట్టేస్తే పొందుకోవడం సాధ్యం కాదు. పొందుకొనే వరకు అడుగుతూనే వుండాలి. అవసరమైతే ప్రభువు పాదాల దగ్గర కన్నీరు కార్చి  మరీపొందుకోవాలి.

మాటి మాటికీ దేవుని సన్నిధిలో అడుగుతూనే వుండాలి. నీవు ఎంత ఎక్కువగా అడిగితే అది నీకు అంత అవసరం అని అర్ధం. నీవు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు,పని చేస్తున్నప్పుడుకూడా అదే ధ్యాసలో వుండాలి. అట్లా నీ మనసుతో ప్రార్దిస్తూనే వుండాలి. నీ అవసరాన్ని గ్రహించిన దేవుడు ఇక ఆలస్యం చెయ్యక, తప్పక అనుగ్రహిస్తాడు.

సిగ్గు లేకుండా మాటి మాటికి అడగాలట. అట్లా అడిగినప్పుడు మాత్రమే ఈ వాగ్ధానం నీ జీవితంలో నెరవేరుతుంది.

"అటువలె ( సిగ్గులేకుండా, మాటి మాటికి ) మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును."
                      లూకా 11:9

అంతేగాని, ఒకటి రెండుసార్లు అడిగినంత మాత్రాన అది మనకియ్యబడదు. వెదకినా దొరకదు. తట్టినా తీయబడదు.

రాత్రివేళ తన స్నేహితుడు వచ్చి, సిగ్గుమాలి మాటిమాటికి అడుగుతుండడంవల్ల కాదనకుండా రొట్టెలు తీసుకొనివచ్చి ఇస్తున్నాడు.

మన 'స్నేహితుడు', అయిన యేసు ప్రభువు వారు మనము అడిగితే? కాదనగలడా? కాదనలేడు. కారణం? ఆయన మన 'ప్రాణ స్నేహితుడు'. మనకోసం తన ప్రాణమునే ఫణముగా పెట్టిన 'మంచి స్నేహితుడు'. విడువక ప్రేమించే 'నిజమైన స్నేహితుడు'. అందరూ విడిచినా, విడువక ఆదరించే 'గొప్ప స్నేహితుడు'.

అడుగుదాం! అడగాల్సినరీతిలో.
పొందుకుందాం! ప్రార్ధించినదానిని.
అనుభవిద్దాం! ఆయన అనుగ్రహించినదానిని.

ఆ రీతిగా మన హృదయాలను సిద్ధ పరచుకొని ప్రార్ధిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Comments