EVERYDAY WE ARE PRAYING for - CT ADS @ 8142229281 - ( @ Sri.B.Rajarao BA LLB., St.MARY'S INFANT school, near muncipal park, proddatur.) * ( @ SURI STICKER SHOP , Proprietor.Sri.B.Suresh Babu, Four road circle, Holmaspeta, Proddatur.) * ( @ Sri.B.Ramesh Babu B.Ed.,LLB., RSR UP ENGLISH MEDIUM SCHOOL, Vaddhiraala.) * ( @ CHRIST TEMPLE family) * ( @ KEERTHANA SEVA SAMITHI , President.Sri.Munagi Raju, Secreatary.Srikanth, Joint Secreatary.Narasimha, Vasanthapeta, Proddatur.) * ( @ AMARESHWAR CEMENT WORKS, Proprietor.Sri.K.Kondal rao, near kotthapally bypass road, mydukur road, proddatur ) * ( @ MALLEMU KONDA CEMENT WORKS, Proprietor.Sri.K.Shivayya, near reliance petrol bunk, teachers colony, mydukur road, proddatur ) *
...Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm in Proddatur. For more Details : +91 8142229281...

Saturday, 31 March 2018

మరణం యేసయ్య ముందు తల వంచింది..  

🙏 *Christ Temple- Proddatur*🙏
 
Telugu Bible Sermons by pastor.Nakkolla Balasubramanyam Daniel

మరణం యేసయ్య ముందు తల వంచింది..  

నిత్య జీవితంలో మనిషికి ఎందరో శత్రువులుంటారు. వ్యాధులు, అప్పులు, నిందలు, అవమానాలు, మానసిక సంఘర్షణలు, నిరాశ... ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో మనిషిని సవాలు చేస్తుంటాయి. లోకంలో పుట్టిన వ్యక్తి గెలుపు ఆటలో కచ్చితంగా దూసుకుపోవాలని ఆకాంక్షిస్తుంటాడు. సమాజంలో తనకు ఓ విశిష్ట గుర్తింపు పాదాక్రాంతం కావాలని ఆశిస్తూంటాడు. అన్ని శక్తులూ కూడగట్టుకుని గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే శత్రువులలోకెల్లా ప్రధాన శత్రువు మరణం అనేది నిజం.    
మరణం ముందు ఎన్నో ఘనతర లక్ష్యాలు నిలువునా నీరోడాయి. ప్రపంచాన్ని ఒంటి చేత్తో జయించిన విజేతల నుండి అతి సామాన్యంగా జీవితాన్ని నెట్టుకొస్తున్న వారి వరకు ఎందరో మరణం ముందు తలలు వంచారు. జీవితంలో ఎక్కడైనా హెచ్చుతగ్గులు ఉన్నాయేమో గాని మరణం దగ్గర ఆ అవకాశం లేదు. నిర్మొహమాటంగా లాక్కెళ్లిపోతుంది. అందుకేనేమో మతాల కతీతంగా, కులాలకతీతంగా, ప్రాంతాల కతీతంగా మరణం ప్రతి ఒక్కరి ముందు శత్రువులా నిలబడింది.   

 ఈ సువిశాల విశ్వంలో ఓ అద్భుత కార్యం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగింది. అదే క్రీస్తు ‘పునరుత్థానం’. ‘పునః’ అంటే తిరిగి, ఉత్థానము అనగా లేపబడుట అని అర్థం. యేసుక్రీస్తు మరణాన్ని జయించి, మరణపు ముల్లును విరిచి, మరణపు మెడలు వంచి తిరిగి లేచిన శుభదినం! ప్రపంచమంతా దివ్య వెలుగుతో, నవ్యమయమైన కాంతులతో విరాజిల్లిన రోజు. ఒక్క మాటలో చెప్పాలంటే... మరణం మరణించిన రోజు!అప్పటి వరకు ఎందరో మరణం ముందు తల వంచారు కానీ ఆ రోజు మరణం దేవుడి ముందు తల వంచింది. అప్పటి వరకు ఎందరో మరణం గుప్పిట్లోకి వెళ్లిపోయారు కానీ ఆ రోజు మరణం దేవుడి గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అసాధ్యం అన్న చోటనే సాధ్యం అనే మాట ఉంది అని నిరూపితమయింది.

  వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరుసజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు..? లూకా సువార్త 24:5

 ‘‘యేసుక్రీస్తు ఖాళీ సమాధి... క్రైస్తవ విశ్వాసానికి పునాది.’’ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ చరిత్రకు మూలరాయి.దురవస్థలో ఉన్న మనిషిని రక్షించి, పాపబంధకముల నుండి వ్యసనముల నుండి విడుదల చేసి, నవ్యపథ నిర్దేశం చెయ్యాలన్న సర్వోత్తమ లక్ష్యంతో యేసు ఈ లోకానికి వచ్చాడు. 
ఎన్ని అవాంతరాలు ఎదురైనా, నిందలు కృంగదీసినా తాను చెయ్యాలనుకున్న పనిని పూర్తి చేశాడు. అవిధేయత ద్వారా పాపం, పాపం ద్వారా మరణం మనిషిని కబళించినప్పుడు యజ్ఞ బలిపశువుగా సిలువలో తన ప్రాణమును అర్పించి మానవ పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. 
  ప్రపంచంలోని మనుషుల భాషలు వేరైనా భావం మాత్రం ఒక్కటే. పాపం నుండి, శాపం నుండి మరణం నుండి విడుదల పొంది పుణ్య లోకాలకు, నిత్యరాజ్యానికి వెళ్లాలన్నదే ప్రతి ఒక్కరి కోరిక. మనిషి మనోభీష్టాన్ని నెరవేర్చడానికే సృష్టికర్త సృష్టిగా మార్పు చెందాడు. సమాజ పునర్వికాసానికి పెద్ద పీట వేసి... ‘నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు’ అన్న బోధతో మానవీయ వ్యవస్థను నిలబెట్టాడు. ఔను! దేవుడు ప్రేమామయుడు గనుకనే మనకందరికీ ప్రేమను గూర్చి విదశీకరించాడు.   

 ఈ రోజుల్లో ప్రస్తుత నవతరానికి ‘ప్రేమ’ అనే మాట సరిగా అర్థం కాలేదనిపిస్తుంది. ప్రేమకు అర్థం తెలిస్తే, ప్రేమ పేరుతో యాసిడ్ దాడులు ఎందుకు జరుగుతాయి? బ్లేడుతో గొంతుకలు ఎందుకు కోస్తారు? ఆయుధాలతో పిచ్చెక్కినట్టు ఎందుకు రెచ్చిపోతారు? హేయమైన దురాకృతాలతో ప్రజల గుండెల్లో భయాందోళనలను ఎందుకు పెంచుతారు?  ‘‘ప్రేమ అంటే ఇతరులను బలి తీసుకోవడం కాదు, ప్రేమ అంటే ఇతరుల కోసం బలైపోవడం.’’ ఇది యేసు చెప్పిన నిర్వచనం. తాను చెప్పడం మాత్రమే గాక చేసి చూపించాడు. ఈ సుందర, సువిశాల భూమ్మీద మధ్య ప్రాంతంలో కలువరి సిలువలో క్రీస్తు మరణించి ప్రేమ పతాకాన్ని ఎగురవేశాడు.   
 ప్రేమ పతాకం పక్కనే విజయ పతాకం కూడా రెపరెపలాడుతుంది. ఇది ఓ అద్భుతమైన జీవిత సత్యం. ప్రేమతోనే ఏదైనా సాధించగలం అనే వాస్తవాన్ని ఏ ఒక్కరూ విస్మరించకూడదు. ‘‘క్రీస్తు ప్రేమను వ్యక్తీకరించాడు గనుకనే మరణాన్ని జయించగలిగాడు. ప్రేమ ముందు ఏదైనా తలవంచవలసిందే అనే సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. 

అందు కతడుకలవర పడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మార్కు సువార్త 16:6

   ఫ్రెంచ్ సైన్యాధిపతియైన నెపోలియన్ బోనాపార్టే కూడా ఇదే విషయాన్ని చెప్పాడు... ‘‘నేను కత్తి ద్వారా ప్రపంచాన్ని జయించాను గానీ క్రీస్తు ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు’’ అని. సాటి వ్యక్తి బాధలను అర్థం చేసుకొని మదర్ థెరిస్సా ‘‘కేవలం ప్రేమతోనే ప్రపంచాన్ని జయించవచ్చు’’ అని చాటి చెప్పారు. ఔను... ‘ప్రేమ పతాకం ఎగురని చోట విజయ పతాకం ఎగురదు.’   

పునరుత్థానం... దివ్యపాఠం!

  ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన క్రీస్తు పునరుత్థానం వలన మనకు కలిగే ప్రయోజనమేమిటి? క్రీస్తు పునరుత్థానం నుండి  మనం సంగ్రహించగలిగే దివ్య పాఠాలు ఏమిటి?    సమాధి అయిన కలలను ప్రభువు బతికిస్తాడు. యూదులందరూ క్రీస్తును రోమన్ గవర్నర్ ముందు నిలబెట్టి, అబద్ధాలు చెప్పి ‘అన్యాయపు తీర్పు’ను తీర్చారు. ఏ చేతులతోనైతే క్రీస్తు పంచిన రొట్టెలు తిన్నారో అవే చేతులతో ఆయనను పిడిగుద్దులు గుద్దారు. సుమారుగా 80 కేజీల బరువైన సిలువను ఆయనపై మోపి, యెరూషలేము వీధుల్లో తిప్పి ఆఖరుకు సిలువ వేశారు. హృదయ విదారకంగా క్రీస్తు సిలువలో వ్రేలాడుతుంటే... ‘క్రీస్తు జీవితాన్ని సమాప్తి చేసేశాం! ఇక లేవలేడు! ముగింపు పలికాం!’ అని వికృతంగా నవ్వుకున్నారు. క్రీస్తును ఒకే ద్వారం ఉన్న రాతి సమాధిలో ఉంచారు. ఈస్టర్ రోజున... అనగా ఆదివారపు తెల్లవారు ఝామున అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ క్రీస్తు మరణ బంధకాలను తెంచుకుని బయటకు వచ్చాడు. ఆశ్చర్యం! అద్భుతం!    
ఔను! ఈ మాటలు చదువుతున్న నీ జీవితంలో నీ కలలు సమాధి చేయబడ్డాయా? కొన్ని కొన్నిసార్లు జీవితంలో ‘నా అనుకునేవాళ్లే’ మనలను సమాధిలో పెట్టేస్తారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగిపోతున్న నిన్ను నిందలతో అవమానాలతో కృంగదీస్తారు. మానసికంగా వేధిస్తారు. నీవు ఏమీ సాధించలేవు అని పదే పదే చెబుతూ నిన్ను పాతాళానికి తొక్కివేయడానికి ప్రయత్నిస్తారు.  
  ఇటువంటి సందర్భాల్లో క్రీస్తు పునరుత్థాన ఘట్టాన్ని నెమరు వేసుకో! ఎంతమంది ఎన్ని రకాలుగా హింసించినా, సిలువ వేసినా, బంధకాలతో బంధించినా క్రీస్తు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. సమాధిని జయించాడు. కర్తవ్య దీక్షతో, బుద్ధి కుశలతతో ముందుకు సాగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. సమాధి అయిపోయిన నీ కలలను తిరిగి బతికిస్తాడు. సమాధి పొరలను చీల్చుకొంటూ నీ దర్శనం బయటకు వస్తుంది. చీకటి అధ్యాయాన్ని చీల్చుకుంటూ ‘వెలుగు’ కిరణం పయనం ప్రారంభిస్తుంది.ఓటమితో కృంగిపోయావా? ఏమీ సాధించలేనన్న ఆత్మన్యూనతా భావం నిన్ను ఏలుబడి చేస్తుందా? సంకల్ప దీక్షతో, దైవబలంతో ముందుకు సాగిపో! నిన్ను నిలువరించే శక్తి ఎవ్వరికీ లేదు.  
  18 నెలల ఓ బాలిక జ్వరంతో చూపు, వినికిడి కోల్పోయింది. నిశ్చేష్టురాలై పడిపోయింది. అందరూ ఆమెను చూసి ఏడ్చారు! విధి వంచించింది అని బాధపడ్డారు. ఓ పక్క నిశ్శబ్దం, మరోపక్క చీకటి. అవి తప్ప  ఆమెకు ఏమీ తెలియదు. జ్ఞానంలో ఎదిగిన తర్వాత తనేంటో తాను తెలుసుకొంది. దేవుడు తనను సృష్టించాడు గనుక ఆ దేవునికే తన జీవితాన్ని అప్పగించుకుంది. కృంగదీసే పరిస్థితులు చుట్టూ ఎన్నున్నా లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయింది. ఆమె ఎవరో కాదు... ‘హెలెన్ కెల్లర్’. ప్రపంచంలో ఈమె పేరు తెలియనివారు లేరు. ‘నా జీవిత గాథ’ అనే పుస్తకం ద్వారా ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. ఎవరో ఆమెను అడిగారట... ‘ప్రపంచంలో నిజమైన గుడ్డివారు ఎవరు?’ అని. ‘‘ఓ దర్శనం లేకుండా, దాన్ని సాధించకుండా బతికేవాడే నిజమైన గుడ్డివాడు’’ అని ఆమె సమాధానమిచ్చింది.    

క్రీస్తే జయము!  

క్రీస్తు మరణాన్ని జయించాడు గనుక ఆయన నీకు కూడా జయమివ్వగలడు. త్రికరణ శుద్ధితో దైవాన్ని వేడుకుంటే సత్ఫలితాలు వస్తాయి. దేవుని మీద భక్తి, సత్ ప్రవర్తన మంచి విలువలతో కూడిన జీవితానికి బాటలు వేస్తాయి.క్రీస్తు  మరణాన్ని జయించి ‘భయపడకుడి’ అనే అభయాన్ని ఇచ్చాడు. ఔను! నీవు జయించువాడవైతే నీ దగ్గర అభయముంటుంది. అనేకులను ధైర్యపరచగలవు. నీ దగ్గర సముచిత ప్రోత్సాహం ఉంటుంది.  

  క్రీస్తు తెలిపిన సత్యం!

  నీవు ఏవిధమైన నేరం చెయ్యకపోయినా సమాజం నిన్ను నిందిస్తోందా? ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్నే నిజం చెయ్యాలని ప్రయత్నిస్తోందా? అయితే విను! సత్యాన్ని ఏ ఒక్కరూ కూడా శాశ్వతంగా సమాధి చెయ్యలేరు! అది ఎవ్వరి తరం కాదు. సత్యమైన క్రీస్తును సమాధిలో ఉంచారు. కానీ ఎక్కువకాలం ఉంచలేకపోయారు. అసత్యాన్ని, అబద్ధాన్ని చీల్చుకుని సత్యం బయటకు వచ్చింది. ఈ లోకంలో పాపాత్ముల విజయం కొంతకాలమే. శాశ్వత విజయం మాత్రం సత్యవంతులదే!   
 ఈ రోజుల్లో ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ విశ్వసనీయత లేదు. నమ్మకత్వం, యధార్థత, నిజాయతీ రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. సాటి మనిషిని నమ్మలేని దుస్థితి ఏర్పడుతోంది. ఎందరో మహానుభావులు కలలుకన్న సుందర భారతావనిని చూడాలంటే ప్రతి ఒక్కరూ సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇచ్చిన మాట మీద నిలబడడం, వాగ్దానాలు నిలబెట్టుకోవడం వల్ల సమసమాజం నిర్మితమవుతుంది. దేవునికున్న విశిష్టమైన లక్షణాల్లో ఒకటి, ‘ఆయన సత్యం చెప్పి నిన్ను గాయపరుస్తాడే గానీ అబద్ధాన్ని చెప్పి నిన్ను ఆదరించడు.’’సత్యం డాక్టరు చేతిలో కత్తిలాంటిది... అబద్ధం అనేది రౌడీ చేతిలో కత్తిలాంటిది. రెండూ గాయపరుస్తాయి. కానీ ఉద్దేశాలు మాత్రం వేరు.   
 యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ‘‘నేనే మార్గము, సత్యము, జీవము’’ అని తెలియచేశారు. పాపము లేనివానిగా పుట్టి, జీవించి, పాపుల కొరకు మరణించి, మూడవ రోజున సజీవంగా తిరిగి లేచి... తెరవబడిన హృదయాల్లో నివసించాలనే ఆశపడుతున్నాడు. నిజదేవుడు ఎక్కడుంటాడు అనే ప్రశ్న నీదైతే... ‘మానవ హృదయంలో’ అనేది నా జవాబు. పునరుత్థానుడైన క్రీస్తు మీ అందరికీ గొప్ప ధైర్యాన్ని, ప్రేమను, శాంతి సమాధానాలను, మోక్షరాజ్య ప్రాప్తిని అనుగ్రహించును గాక. ఆమెన్. 

🙏 *Christ Temple- Pdtr*🙏

Friday, 30 March 2018

యేసు ప్రభువు సిలువ యాత్ర

🙏 *Christ Temple- Pdtr*🙏 

Telugu Bible Sermons by Pastor.Nakkolla Balasubramanyam Daniel 

యేసు ప్రభువు సిలువ యాత్ర   యెరూషలేము నుండి కల్వరి కొండకు సాగిన సిలువయాత్రలో అనేకమంది ఆయనను వెంబడించిరి. ఆ జన సమూహంలో అనేక గుంపుల ప్రజలు వుండవచ్చును కాని ప్రాముఖ్యంగా మూడు గుంపులను లూకా 23:26-28 నుండి ధ్యానిద్దాం. 
 1.అపహసించి, సిలువవేసిన గుంపు సిలువ యాత్రలో గెత్సెమనె తోట నుండి వేదన ప్రారంభమయినది మొదలు తుది శ్వాస విడిచే వరకు పలునిందలు, శ్రమలు చెప్పశక్యము కాని బాధను అనుభవించెను. ఈ యాత్రలో మొదటి గుంపు అపహసించి, బాధించిన గుంపు. ఆయనను అనేక రీతులుగా బాధించిరి. 
 1. ముఖము మీద ఉమ్మిరి, 
 2. ముఖముపై గుద్దిరి, 
3. అరచేతులతో కొట్టిరి, 
4. కొరడా దెబ్బలు 39 సార్లు కొట్టిరి,  
5. ముళ్ళ కిరీటం, 
 6. రెల్లుతో తల మీద కొట్టిరి, 
 7. కాలు మీద కాలుపెట్టి కరుకైన మేకు,
 8. చేతులలో మేకులు, 
 9. అనేక నేరములు మోపిరి, 
10. దూషించిరి, 
 11. అపహసించిరి, 
12. ప్రక్కలో బళ్ళెపు పోటు పొడిచి,
 13. బరువైన శరీరంతో ఆరు గంటలు సిలువపై భారముగా వ్రేలాడెను. ఈ మొదటి గుంపు అనేక శ్రమలు బాధలు పెట్టి ఆయనను హింసించిరి. ఈ మొదటి గుంపులో ఎవరెవరు ఉన్నారో పరిశీలిద్దాం. లూకా 23:27లో 'గొప్ప జనసమూహం'లో ఎవరెవరున్నారు?

 ఎ. సైనికులు :  
వీరు రోమా సైనికులు, బంట్రోతులు. వీరి పని నేరస్థులను కఠినంగా శిక్షించి ఘోరంగా చంపడము. చాలా బలమైనవారు బలిష్టమైన కండరములు కలిగి ఒక్క గుద్దుతో మనిషిని బలహీనపరచేటట్లు శక్తికలిగి వుంటారు. వీరు యేసయ్య వీపుపై ఒక్కొక్క కొరడాదెబ్బ కొడుతూవుంటే, గుద్దుతూ వుంటే చెప్పలేని బాధ. ఈ సైనికులకు ఎటువంటి జాలి, కరుణ వుండదు. 

బి. మత గురువులు :  
నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అనే గొప్ప ఆజ్ఞలు, ధర్మశాస్త్రమును పాటించి, బోధించే పెద్దలు, నాయకులు, ప్రజల పాపక్షమాపణ కొరకు పరిశుద్ధ స్థలములో అర్పణలు అర్పించే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఇంకా అనేక మంది యూదా మతనాయకులు యేసయ్యను పిలాతు నొద్దకు, అక్కడ నుండి హేరోదు నొద్దకు, మరలా పిలాతు నొద్దకు త్రిప్పుచూ అపహసిస్తూ సిలువకు అప్పగించారు. 

సి. యూదులు :  
యాకోబు సంతానాన్ని దేవుడు ఇశ్రాయేలీయులుగా ఆశీర్వదించాడు. ఆ 12 గోత్రముల వారందరూ అందులో ముఖ్యమైన యేసయ్య వచ్చిన గోత్రమైన యూదా జాతివారు కూడా ప్రభువును సిలువకు అప్పగించి, బాధించి, శ్రమపెట్టిన వారిలో వున్నారు. దేవుని పిల్లలుగా పిలువబడిన ఈ జాతి వారంతా దేవుని కుమారునే సిలువకు అప్పగించిరి. వీరునూ చేయని నేరములు ఆయనపై మోపి దూషించి, పరిహాసమాడిరి.

 డి.అన్యజనులు : 
 ఈ గుంపులో అన్యజనులు కూడా కలరు. వారునూ దూషించిరి. 

ఇ. రోమా ప్రభుత్వ నాయకులు : 
 గవర్నరైన పిలాతు అంటే అందరికీ భయము. పిలాతు గలతీయుల రక్తము బలులలో కలపిన క్రూరుడు. అంతటి అగత్యము చేసినపుడే ఎదిరించడానికి ఎవరికినీ ధైర్యం చాలలేదు. ఏ ప్రతిపక్షం ఎదురవ్వలేదు. అటువంటి వ్యక్తికి సిలువను ఆపే హక్కు అధికారము వుంది, కాని అతడునూ ప్రజల కోరిక మేరకు సిలువకు అప్పగించెను. ఇంకా హేరోదు అపహసించెను. (లూకా 23:11) ఇంకా ప్రభుత్వమంతా ఏకమై సిలువకు మార్గం చూపెను.  

 ఎఫ్‌. మార్గమున పోయేవారు :  
యేసయ్య శరీరమంతా గాయములతో ఉడికించిన మాంసము వలే తయారైంది. ఆయన భుజములు గొప్ప అలసట చెంది, కండరములు గొప్ప అలల వలే తిమ్మిరితో బాధ పెడుతూ, వీపు అంతా నాగలి సాలు వలే దున్నబడి మాంసముతో పాటు నరములు చేరి రక్తము ప్రవహిస్తూ వుంటే, రొమ్ము దగ్గర నలగగొట్టబడిన బాధ, వెంట్రుకలు పెరికిన బాధ ఇటువంటి భయంకరమైన బాధతో వుంటే దారినపోయేవారు తల ఊపుచూ నీవు దేవుని కుమారుడవైతే సిలువమీద నుండి దిగిరమ్మని అపహసించిరి. 

జి. ఇద్దరు దొంగలు :  
సిలువమీద నున్న ఇద్దరు దొంగలు ఆయనను నిందించిరి. (మత్త 27:44) కొంతసేపు అయిన తర్వాత ఒకడు మరొకనితో మనకైతే ఇది న్యాయమే. ఈయనకు ఇది తగినదికాదు, ఈయన యందు ఏ దోషము లేదు అని ఒప్పుకొనెను. యేసూ! నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకొనుమని ప్రార్ధించగానే యేసయ్య - నేడు నీవు పరదైసులో నాతో కూడా ఉందువని చెప్పెను. రెండవవాడు మారుమనస్సు పొంది దేవుని రక్షణ పొందుకొనెను. 

హెచ్‌. యేసయ్య శిష్యులు :  
1.పేతురు. పేతురు ఎక్కువగా యేసయ్యతో గడిపినవాడు అనేకసార్లు ప్రార్ధించుటకు యేసయ్య పేతురును వెంటబెట్టుకొని పోయెను. చివరి గడియలలో కూడా ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా (లూకా 22:56) 3 సార్లు నీవు బొంకుదువని యేసయ్య చెప్పెను. ఈ విధంగా ఆయన అద్భుతాలు చూచి ఆయనతో సహవాసం చేసిన గొప్ప శిష్యుడు. పేతురు అపహాసకులు గుంపులో నున్నాడు. మార్కు 14:54లో 'పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంటపోయి బంట్రోతులతో కూడా కూర్చొండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను'. యేసయ్య శ్రమ పడుచూ వుంటే ఆయన వెంట ఉండవలసిన పేతురు గుంపులో వున్నాడు. 
ప్రియ సోదరుడా! సోదరీ! నీవు ఏ గుంపులో నున్నావు! అపహసించి, సిలువ వేసేవారితో నున్నావా? అయితే ఆ తరువాత పేతురు పశ్చాత్తాపముతో జరిగినది గుర్తెరిగి ఏడ్చుచూ ప్రభువు యొద్దకు తిరిగెను. నీవును మొదటి గుంపులో వుంటే పేతురు వలే పశ్చాత్తాపముతో తిరిగి యేసయ్య గుంపునకు రా. 

 ✅  2.కన్నీరు కార్చి విలపించే గుంపు : 
 లూకా 23:27,48 లో ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచూ దుఃఖించుచూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నా పాపముల నిమిత్తం, నాకు పరలోక మోక్షం అనుగ్రహించడం కోసం శ్రమలు భరించావా యేసయ్యా అని రోదిస్తున్నారు.   
 మనం ఎలా వున్నామో ఒక్కసారి పరీక్ష చేసుకుందామా.. ఆ సిలువ యాత్ర ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా.. 🙏 *Christ Temple - Proddatur* 🙏

Thursday, 29 March 2018

యేసుప్రభువు సిలువలో పలికిన 7 మాటల ధ్యానం

🙏 *CHRIST TEMPLE- PDTR*🙏

యేసుప్రభువు సిలువలో పలికిన 7 మాటల ధ్యానం

🔹1⃣ *యేసు ప్రభువు వారు సిలువలో పలికిన మొదటి మాట*

✅ *క్షమాపణ*

*తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను."* లూకా 23:34

ఆయన జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలో పరిశుద్ధ వుంది. కాని, సర్వమానవాళి పాపం నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా క్రయదనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి కొనిపోబడుతున్నాడు.
•సిలువతో సాగిన ఆయాత్ర  యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గొల్గొతాలో ముగియనుంది.
•39 కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు.
• వీపు మీద భారమైన సిలువ, భరించరాని అవమానం
• ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు
•గేళి చేయబడుతూ,హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గొతాకు చేరింది ఆయాత్ర.
•కాళ్ళు, చేతులలో సీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం.
• ఆరు అంగుళాలు కలిగిన మూడు మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతుంది.
• ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతుంది.

అటువంటి భయానకమైన పరిస్థితులలో ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారి నోటనుండి వెలువడుతున్న మొదటిమాట.
"తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు".  

యేసు ప్రభువు వారు ఏమి భోధించారో? దానిని తప్పకుండా చేసి చూపించారు. తాను చెయ్యడానికి ఇష్టం లేనిది ఏది ఆయన బోధించలేదు. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. మత్తయి 5:44

ఆయన భోధించినట్లుగానే,
•శత్రువులను ప్రేమించాడు.
•ఆయనను హింసించే వారికొరకు ప్రార్ధించాడు.      "తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు".  
ఈ మాట వింటుంటే? శరీరం జలదరిస్తుంది. కాని ఆ దినాన్న బండలుగా మారిన ఆ రాతి హృదయాలు చలించలేదు. స్పందించలేదు. నేటి మన జీవితాలు కూడా వారికేమాత్రమూ తీసిపోలేదు. అనుక్షణమూ ఆయనను సిలువ వేస్తూనే ఉన్నాము. అయినప్పటీ, నేటికినీ నీ గురించి, నాగురించి తండ్రి దగ్గర ఆయన  విజ్ఞాపన చేస్తూనే వున్నాడు. ''వీరిని క్షమించమని" అట్లా అని, మార్పు లేకుండా ఇట్లానే జీవిద్దామా? క్షమాపణను నిర్లక్ష్యం చేసి దేవుని ఉగ్రతకు పాత్రులవుదామా? ఆయన దేవుడు కాబట్టి అట్లా చెయ్యగలిగాడు. నా వల్ల కాదులేనని నీకు నీవే సర్దిచెప్పుకొనే ప్రయత్నం చెయ్యొద్దు. యేసు ప్రభువు అడుగు జాడల్లో నడచిన స్తెఫెను కూడా మరణ సమయాన్న కూడా ఆయనను అనుసరించ గలిగాడు. ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.
అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. అపో.. 7:59,60

గ్లాడిస్  తనభర్త  గ్రాహం స్టెయిన్స్ ను, తన ఇద్దరి కుమారులను సజీవ దహనం చేసిన వారిని క్షమించి వారిని దేవుని దగ్గరకు నడిపించ గలిగింది.
క్షమించడం క్రైస్తవ జీవితంలో ఒక భాగం కావాలి. ఆయన పిల్లలముగా అట్టి జీవితాన్ని జీవించగలగాలి.

ఆయన పరిశుద్ధ రక్తంలో పవిత్ర పరచబడదాం! ఆయన సమరూపంలోనికి మార్చబడదాం!
ఆయన వలే, మన శత్రువులను సహితం క్షమిద్దాం! వారి కొరకు ప్రార్ధిద్దాం!

----------------------

🔹2⃣ *యేసు ప్రభువు వారు సిలువలో పలికిన రెండవ మాట*

   ✅ *అభయం*

*నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా  23:43*

ప్రపంచ చరిత్రలో ఒక చిన్న అవకాశాన్ని నిత్యరాజ్యాన్ని స్వతంత్రించు కోవడానికి ఉపయోగించుకున్న వ్యక్తి ఎవరైనా వున్నారంటే? అతడు. "ఆ సిలువ వేయబడిన దొంగ మాత్రమే".

యేసుప్రభువును క్రూరముగా హింసిస్తున్న వారి కొరకు "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు" అని తండ్రికి విజ్ఞాపన చేస్తూ  ఆయన సిలువలో పలికిన మొదటి మాట అతనిలో గొప్ప పశ్చాత్తాపాన్ని తీసుకువచ్చింది. ఆ పశ్చాత్తాపము ప్రభువుని వేడుకోవడానికి తొందరచేసింది. ఇక ఎంత మాత్రమూ ఆలస్యం చెయ్యక "యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము". అంటూ అర్ధిస్తున్నాడు. అది అతని పెదవుల నుండి వచ్చిన మాటకాదు. అతని హృదయాంతరంగంలో నుండి పొంగి పొరలివస్తున్న ఆవేధన. కారణం? అతనికి రెండు విషయాలు అర్ధమయ్యాయి.
1. ఆయన రాజు
2. ఆయనకొక రాజ్యముంది.
అది శాశ్వత రాజ్యం. ఆ రాజ్యంలో నేను కూడా వుండాలని.

యేసు ప్రభువువారు ఆదొంగ యొక్క గతచరిత్రను ఎత్తి చూపలేదు. తర్వాత నీగురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పలేదు.
అతని హృదయంలో నుండి పెల్లుబుకుతున్న పశ్చాత్తాపాన్ని గ్రహించిన ప్రభువువారు  "నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను."
అని అభయమిచ్చారు. నీవు నాతో వుండే అవకాశం వుంది అనడం లేదు. "నిశ్చయం". ఇది ఎవ్వరూ మార్చలేని తిరుగులేని సత్యం. ఒక్క చిన్నమాటకు ఆ దొంగ అంతగా ప్రతిస్పంధించాడు. ఆ ప్రతిస్పందన అతనిని పరదైసుకు చేర్చింది. సంవత్సరాల తరబడి, గంటలకొద్దీ వాక్యం వింటున్నామే? మన రాతి హృదయాలు మాత్రం స్పందించుట లేదు. ఆయన ఒక రాజు, ఆయనది శాశ్వత రాజ్యం అనే గ్రహింపులేదు. సరికదా, ఆ దొంగ బాప్తిస్మం తీసుకోలేదు కదా? ప్రభు రాత్రి భోజనం లో పాలుపొందలేదు కదా? నేనెందుకు బాప్తిస్మం తీసుకోవాలి? ఎందుకు ప్రభు రాత్రి భోజనం ఆచరించాలి? ఆ దొంగ ప్రార్ధించినప్పుడు అతడు పరదైసుకు చేరాడు కదా?  ప్రార్ధిస్తే నేనెందుకు చేరను? అంటూ లెక్కలేనన్ని ప్రశ్నలు.
అతడయితే, జీవిత చివరి క్షణాల్లో వున్నాడు. అతనికి ఎట్లాంటి అవకాశాలూ లేవు. నీకేమయ్యింది? నీవేమి సిలువలో వ్రేలాడడం లేదు కదా? రక్షించ బడడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి, పరిశుద్ధ జీవితం జీవించడానికి నీకు చాలినన్ని అవకాశాలు దేవుడిచ్చాడు. దేవునికి లోబడకుండా, నీకు నచ్చినట్లు జీవించి, ఆయన దయామయుడు కదా! జీవితం చివరిక్షణంలో  క్షమించమని ఒక్కమాట అడిగితే క్షమించేస్తాడు అనే భ్రమలో మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ వుండవద్దు. నీ జీవితంలో అనేక సంవత్సరాలు వ్యర్ధముగా దొర్లిపోయాయేమో?

ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.
                2 కొరింది 6:2

కనీసం నేడైనా, పశ్చాత్తాపముతో ఆయన పాదాల చెంతచేర గలిగితే? నీ గత జీవితం ఎట్లాంటిదైనా, ఆయన ప్రశ్నించడు. ఆ నిత్య రాజ్యానికి వారసుని చేస్తాడు.
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
నిత్య రాజ్యానికి వారసులవుదాం! ఆమెన్

-----------------------

🔹3⃣ *యేసు ప్రభువు వారు సిలువలో పలికిన మూడవ మాట*

✅ *ఆదరణ*

*"అమ్మా,యిదిగో నీ కుమారుడు ......యిదిగో నీ తల్లి" యోహాను 19:26*

ఒక తల్లి పదిమంది పిల్లలను పెంచి పోషిస్తుంది. ఆ పదిమంది పిల్లలు కలసి ఆఒక్క తల్లిని పెంచలేక అనాధనుచేసి విడచి పెట్టేసిన పిల్లలెందరో? అనాధ ఆశ్రమాలలో, వృద్ధ ఆశ్రమాలలో తలదాచుకొంటున్న తల్లులెందరో? అట్లాఅని, వారి ఆర్ధికస్థితి తల్లిని పోషించ గలిగేదిగా లేదా అంటే? కానేకాదు. అన్నీ సమృద్ధిగా కలిగినవారే. లేదంటే, వారు
తమ భాద్యతను, దేవుని ఆజ్ఞను మరచినవారు. వారి జాబితాలో మనమూ వున్నామా? అయితే ఒక్క మాట!
యేసుప్రభువు వారు కల్వరి గిరిలో ఆ సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో మూడు మేకులతో వ్రేలాడుతున్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఒక కుమారునిగా తన భాద్యతను నెరవేర్చుతూ ఆయన తల్లిని 'యేసు ప్రభువు రొమ్మును ఆనుకొనియున్న శిష్యుడు'గా పేరొందిన యోహానుకు  అప్పగిస్తూ పలికిన ఈ మాట మన జీవితాలకు గొప్ప మేల్కొలుపు. పరిశుద్ధ గ్రంధం తలిదండ్రులకు చెప్పలేనంత ప్రాధాన్యత ఇచ్చింది.
దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటి తలిదండ్రుల కోసమే.
నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమ  20:12

సన్మానించడం అంటే?  శాలువాలు కప్పి, పూల బొకేలు ఇవ్వాలని కాదుగాని, వారి అవసానదశలో వారి అవసరాలు గుర్తెరిగి వాటిని తీర్చగలగడం.

•తలిదండ్రులకు విధేయత చూపాలి. వారిని సన్మానించాలి. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలొ మొదటిది.

పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులై యుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీతండ్రిని తల్లిని సన్మానింపుము,
అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎఫెస్సి 6:1-3

నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను."
       సామెతలు 23:25

అట్లా కాకుండా వారిని నిర్లక్ష్యం చేసి, వారిని దూషించినట్లయితే?
"తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును."
         సామెతలు 20:20

కారు చీకట్లో నీ దీపం ఆరిపోతే? నీ గమ్యం ఎట్లా చేరుకోగలవు? నీవు ఆశించేది ఎట్లా పొందుకోగలవు?
ఆలోచించు?

ఒక్కటి మాత్రము గుర్తుంచుకోవాలి! నేడు మన తలిదండ్రులను ఎట్లా చూస్తున్నామో? రేపు మన పిల్లల చేత అట్లానే చూడబడతాము. "నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును."ఒబెద్యా 1:15

మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7

కొబ్బరి చెట్టు నుండి, ఖర్జూరాలు ఆశించలేము. అట్లానే, మనము నేడు మన తలిదండ్రులను నిర్లక్ష్యము చేసి రాబోయే దినాలలో మనము సంతోషాన్ని పొందగలము అనుకోవడం మన జీవితాలకు శ్రేయష్కరము కాదు. ఒకవేళ ఇంత వరకూ వారిని నిర్లక్ష్యం చేసామేమో? యేసు ప్రభువు వారు సిలువలో పలికిన మాట ద్వారా మన బాధ్యతను గుర్తుచేస్తున్నారు. సరిచేసుకుందాం! వారి అవసరాలు గుర్తెరిగి మన బాధ్యతను నెరవేర్చుదాం! ఆయన మాటకు లోబడదాము. ఆమెన్

----------------------

🔹4⃣ *యేసు ప్రభువు వారు సిలువలో పలికిన నాల్గవ మాట.*

✅ *"తండ్రితో ఎడబాటు"*

*నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మత్తయి  27:46*

యేసుప్రభువు వారు  భరిస్తున్న సిలువ భారము కంటే, ఆ ఘోర అవమానము కంటే, ఆయనను మరింత ఎక్కువగా బాధించిన విషయం ఏమిటంటే? "తండ్రితో ఎడబాటు".

ఆయన మరి కొద్ది క్షణాల్లో తన ప్రాణమును తండ్రికి అప్పగించ బోతున్నాడు. తండ్రితో సహవాసాన్ని కోల్పోబోతున్నాడు. ఆ ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా కేక వేస్తున్నాడు. అది ఒక గొప్ప 'ఆర్తనాధం'.అది తండ్రితో శాశ్వతమైన ఎడబాటు కాదు. అత్యంత స్వల్పమైన ఎడబాటు మాత్రమే. అయినా, దానిని కూడా ఆయన భరించ లేకపోతున్నాడు. తండ్రి తన సన్నిధిని కుమారుని నుండి తీసెయ్యడానికి ఇష్టపడ్డాడు.  కావాలనే అట్లా చేస్తున్నాడు.

"అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను" యెషయా 53:10

ఒకవేళ అతనిని నలుగగొట్టడానికి తండ్రికి ఇష్టం లేకపోతే? ఈరోజు ఈ రక్షణ మనకు లేదు. ఆ తండ్రి ప్రేమలో గొప్పత్యాగం వుంది.

"మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను." 1 కొరింది 5:21

ఏదేను వనములో మనము తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునఃరుద్దరించడానికి మన ప్రియ రక్షకుడు తన తండ్రి సహవాసాన్ని కోల్పోబోతున్నాడు.
ఎందుకంటే? ఆ సిలువ యాగమే తండ్రితో మనము కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునఃరుద్దరిస్తుంది. తండ్రి త్యాగం, కుమారుని విధేయత, రెండూ కలసి ఆదినాన్న తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి నెలకొల్పాయి. ఇంతకీ, నెలకొల్పబడిన ఆ సహవాసం కొనసాగుతుందా? ఆగిపోయి ఎంత కాలమయ్యింది? ఎంత కాలమయ్యిందో కూడా గుర్తులేనంత కాలమయ్యిందా?
దేవునితో సంబంధాన్ని కొనసాగిస్తున్నాం! మంచిదే. మరి సహవాసం మాటేంటి..?సంబంధానికి, సహవాసానికి వున్న వ్యత్యాసమేమిటి?
ఆదాము ఏదేనులో నుండి గెంటి వేయబడినప్పటికీ అతడు దేవుని కుమారుని గానే పిలువబడ్డాడు. అది తండ్రి కుమారుల 'సంబంధం'.
కాని, గెంటి వేయబడడం ద్వారా అతడు దేవునితో 'సహవాసాన్ని' కోల్పోయాడు.
మనము కూడా ఆయన పరిశుద్ధ రక్తములో కడుగబడి దేవుని బిడ్డలుగా, దేవునితో 'సంబంధాన్ని' కలిగియున్నాము. కాని, తిరిగి పాపం చెయ్యడం ద్వారా ఆయనతో 'సహవాసం' కోల్పోతున్నాము.
సంబంధం మాత్రమే కలిగియుండి, సహవాసం లేకపోతే? ఆ నిత్య రాజ్యాన్ని చేరలేము. సహవాసము కోల్పోవడానికి గల ఏకైక కారణం? మన పాపమే. అట్లా అయితే?
పాపం లేని యేసు ప్రభువు వారు ఎందుకు తండ్రితో సహవాసాన్ని కోల్పోయారు?
మన పాపముల నిమిత్తం ఆయన పాపముగా  చెయ్యబడ్డాడు గనుక. అందుకే ఆయన ఆక్రందన. ఆ సిలువ ప్రేమను అర్ధం చేసుకుందాం! మన జీవితాలను సరి చేసుకుందాం! కోల్పోయిన సహవాసాన్ని ప్రారంభిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
నిత్య రాజ్యానికి వారసులవుదాం! ఆమెన్

-----------------------

🔹5⃣ *యేసు ప్రభువు వారు సిలువలో పలికిన ఐదవ మాట*
            
✅ *"దప్పిగొనుచున్నాను."*
        యోహాను 19:28

యేసుప్రభువు ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆయన ప్రబోధించిన విషయాలు.

*నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు;* యోహాను 4:14

"దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను."
               యోహాను 7:37

ఆయనిచ్చే నీళ్ళు త్రాగితే ఎన్నడునూ దప్పిగొనమట. దాహం వేస్తే నాదగ్గరకు వచ్చి మీ దప్పిక తీర్చుకొనండని చెప్పిన ప్రభువు వారే దప్పిక గొనడమేమిటి? ఆయన దప్పికను  ఆయన తీర్చుకోలేనప్పుడు, ఇక, మన దప్పికను ఎట్లా తీర్చగలడు?

*యేసయ్య సిలువలో దప్పిగొనడానికి గల కారణాలు?

🔹• యేసు ప్రభువు వారు జన్మించడానికి వందలాది సంవత్సరాల ముందే, అనేకమైన ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. వాటిలో ఒక్కటైననూ తప్పిపోవడానికి వీల్లేదు. ఆ ప్రవచన నేరవేర్పులో భాగముగా ఆయన దప్పిగొన్నారు.

"వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి."
              కీర్తనలు 69:21

🔹•అప్పటికే, యేసుప్రభువువారు
ఆ మండుటెండలో యెరూషలేము వీధులలో భారమైన సిలువను మోసారు. ఒకవైపు శరీరంనుండి రక్తం కారుతూనే వుంది. అట్లాంటి పరిస్థితులలో దప్పిగొనడం అత్యంత సహజము.

ఎందుకంటే?
సిలువ వేయబడినప్పుడు ఆయన 'పరిపూర్ణ మైన మానవుడు'.
అదే సమయంలో 'పరిపూర్ణమైన దేవుడు'.

🔹•నిత్య నరకంలో మనము దప్పిగొనకూడదని, మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిగొన్నారు.
ధనవంతుడు ఒక్క నీటిబొట్టు కొరకు ఎంత అల్లాడిపోతున్నాడో? అట్లాంటి పరిస్థితి నుండి నిన్నూ,నన్నూ తప్పించడానికి ఆయనే దప్పిగొంటున్నారు.

"తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికర పడి, తన వ్రేలికొనను--నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలువేసి"
            లూకా 16:24

🔹•అనంత కాలము మనకు దాహము లేకుండా చెయ్యడానికి ప్రియరక్షకుడైన యేసు ప్రభువు వారు దప్పిగొన్నారు.

"వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును."
      ప్రకటన  7:16,17

ఆయన నీకోసం ఇంతచేస్తే?
దేనికోసం నీ దప్పిక?
శరీరాశా? నేత్రాశా? జీవపుడంబమా? వీటికోసమేనా నీ ప్రాకులాట? ఆత్మ ఫలాలు ఫలించకుండా, శరీర కార్యములనే నెరవేర్చుకుంటూ నేటికినీ ఆయనకు ఆచేదు చిరకనే మరళా, మరళా త్రాగిస్తావా?
వద్దు! ఒక్కసారి చాలు.

ఆ బండ ఒక్కసారే కొట్టబడాలి. అది చాలు. మోషే మరళా కొట్టాడు. కనానులో అడుగు పెట్టలేకపోయాడు.

ఆయన ఆ చేదుచిరకను ఒక్కసారి త్రాగితే చాలు. మనము మరళా త్రాగించే ప్రయత్నం చేస్తే? ఆ పరమ కనానులో అడుగు పెట్టలేము.
వద్దు! శరీరకార్యాలకు గతించిన కాలమే చాలు. ఆ దివ్య ప్రేమను అర్ధం చేసుకో.
కోరహు కుమారులు వారికిగల దప్పికను గురించి ఈరీతిగా పాడుతున్నారు.

"నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది."
           కీర్తనలు 42:2

యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయు చున్నవి.
               కీర్తనలు 84:2

అవును! మనమునూ నిత్య జీవములోనికి చేర్చగల, జీవముగల దేవుని కొరకు ఇట్లాంటి తృష్ణను కలిగియుండాలి.
ఇటువంటి దప్పికతో ఆయన కోసం ఎదురుచూద్దాం!
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
నిత్య రాజ్యానికి వారసులవుదాం! ఆమెన్

--------------------

🔹6⃣ *యేసు ప్రభువు వారు సిలువలో పలికిన ఆరవ మాట*

✅ *"సమాప్తమైనది"*
        యోహాను 19:30

ఎలిజబెత్ రాణి తన మరణపడకపై చివరి క్షణాల్లో తన పనికత్తెతో ఇట్లా అందట. అయ్యో! నేను జీవిత చివరి క్షణాల్లో వున్నానే? నాకున్న ఒకే ఒక్క జీవితం అంతమై పోతుందే? జీవితాన్ని ప్రేమించాను, ఉన్నత శిఖరాలను అధిరోహించాను. కాని ఆ జీవితం అంతమై పోతుందన్న తలంపే నన్ను  చెప్పలేనంతగా భాధిస్తుంది అని చెప్తూనే, తన నోరు శాశ్వతంగా మూత పడిందట.

కాని ప్రియ రక్షకుని అంతము ఎంత భిన్నంగా ఉందంటే?

మరణం ఆయనకు కొన్ని క్షణాల దూరంలో మాత్రమే వుంది. లేఖనాల నేరవేర్పుకు ఇక ప్రక్కలో బల్లెపు పోటు, తండ్రికి తన ఆత్మను అప్పగించడం మాత్రమే మిగిలివుంది. అయినప్పటికీ, గొప్ప సంతృప్తితో, గొప్ప విజయంతో ఈ మాట చెప్పగలుగు తున్నాడు.
'సమాప్తమయ్యింది' ఏమి సమాప్తమయ్యింది?

🔹 •ఏ పని నిమిత్తం పరలోక మహిమను విడచి, దాసుని రూపము ధరించి భూలోకానికి వచ్చాడో? ఆ కార్యము సమాప్తమయ్యింది.

'చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని.'
             యోహాను 17:4

🔹•సర్వలోకాన్ని పాపము నుండి విమోచించి, వారిని  రక్షణలోనికి నడిపించే కార్యము సమాప్తమయ్యింది.

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను.
            లూకా  19:10

పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను 1 తిమోతి 1:15

చెయ్యాల్సిన బలిఅర్పణ, ప్రాయశ్చిత్తము సమాప్తమయ్యింది.

🔹•ధర్మశాస్త్ర విధిని నెరవేర్చి, అది మనకు విధించే శిక్షను ఆయన భరించడం సమాప్త మయ్యింది.

ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.
              మత్తయి 5:17

🔹•ఆయన శ్రమలు సమాప్తమయ్యాయి.

మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
           1 పేతురు 2:24

🔹•సాతాను శక్తిని సర్వ నాశనం చెయ్యడం సమాప్తమయ్యింది.

సాతాను ఇంకనూ బంధించబడలేదు గాని, వాడి నాశనం ప్రకటించబడింది.

ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును.
          యోహాను 12:31

ఆయన తనపని సమాప్తంచేసి చాలా కాలమయ్యింది. యుగ సమాప్తికి రోజులు దగ్గరయ్యాయి కుడా. 'ఆరు' అనే సంఖ్య సమాప్తాన్ని సూచిస్తుంది.
దేవుడు సృష్టిని 'ఆరు'దినాలలో సమాప్తం చేసాడు. యేసు ప్రభువు వారు సిలువలో పలికిన 'ఆరవమాట' సమాప్తమైనది.
ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు 'ఆరువేల సంవత్సరాలు'. ఇవి దేవుని దృష్టిలో ఆరుదినములు. 'ఆరు' సమాప్తానికి సూచనగా వుంది కాబట్టి, ఇక యుగసమాప్తి, అంటే? ఆయన రెండవరాకడ సమీపం కానుంది అనే అంచనాకు రావొచ్చు. ఈ లెక్కలు కాదుగాని, లేఖనాలు, భూమి మీద జరుగుతున్న సంభవాలు వీటిని స్పష్టం చేస్తున్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా, రాకడకు సిద్ధపాటు లేకుండా, అంతం వెంటనే రాదులే అనే ధీమాతో బ్రతికేస్తున్నాము. వద్దు!
ఆయన రక్షణ కార్యమును సమాప్తము చేసి, ఆరక్షణను ఉచితముగానే నీకు అనుగ్రహించాడు. నిర్లక్ష్యము చేస్తే? శిక్ష నుండి తప్పించుకోలేవు. కనీసం నేడైనా ఆ రక్షణను నీవు స్వీకరించ గలిగితే? ధన్యత లోనికి ప్రవేశించగలవు.

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
నిత్య రాజ్యానికి వారసులవుదాం!  ఆమెన్

-----------------------

🔹7⃣ *యేసు ప్రభువు వారు సిలువలో పలికిన ఏడవ మాట*

✅ *ఆత్మను తండ్రి కి అప్పగిస్తూ వున్నాడు*

*"అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించు కొనుచున్నాననెను" లూకా 23:46*

యేసు ప్రభువు వారు మరణానికి ముందు నెరవేరవలసిన చిట్టచివరి ప్రవచనం ఈ మాటతో నెరవేరింది.

నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను
          కీర్తనలు 31:5

యేసు ప్రభువు వారు ఈ లోకమునకు ఎందుకు రావలసి వచ్చిందో ఆ కార్యమును సంపూర్తి చేసారు. చెయ్యకుండా మిగిల్చింది ఏమీలేదు. గొప్ప సంతృప్తితో తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు. ఆయన ప్రాణమును ఎవ్వరూ తీయలేదు. ఆయనే అప్పగించాడు. ఆయన ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం వుంది.

"నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను"
          యోహాను 10:18

యేసు ప్రభువు వారు ఆయన రాజ్య సువార్తను 'ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు' అంటూ... ప్రారంభించి. ఈ లోకంలో సశరీరుడుగా చివరి మాటగా 'ఆత్మను అప్పగించుకొను చున్నాను'. అంటూ ముగించడం ద్వారా ఆయన ఆత్మకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో అర్ధమవుతుంది. జీవింప చేసేది ఆత్మ మాత్రమే. శరీరం ప్రయోజనం లేనిది. కాని, మనమయితే ప్రయోజనంలేని  దానికోసం ప్రాకులాడుతున్నాము. నిత్యమూ జీవింపజేసే ఆత్మను గూర్చిన ఆలోచనగాని, అవగాహనగాని లేకుండా బ్రతికేస్తున్నాము.

ఆత్మయే జీవింప చేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము.
       యోహాను 6:63

శరీరము ఎందుకు నిష్ప్రయోజనము అంటే? మట్టిలోనుండి తీయబడిన శరీరం తిరిగి మట్టిలో కలసిపోవాల్సిందే.

మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.
           ప్రసంగి 12:7

అయితే, మన శరీర అవయవములను దేవునికి సజీవయాగముగా సమర్పించు కోవాలి.  మన శరీరమును దేవుని కోసం పరిశుద్ధముగా కాపాడుకోలేనప్పుడు, ఎంత మాత్రమూ మన ఆత్మను దేవునికి అప్పగించుకోలేము.

పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
          రోమా 12:1

అవును! యేసు ప్రభువు వారు తన శరీరాన్ని పరిశుద్ధముగా కాపాడుకోగలిగారు కాబట్టే, తన ఆత్మను తండ్రికి అప్పగించుకోగలిగారు.
మనము కూడా దేవుని కోసం శ్రమపడుతూ, మన శరీరాన్ని పరిశుద్ధముగా కాపాడుకొంటూ  మంచి ప్రవర్తన గలవారమై సృష్టి కర్తయైన దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి.

దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.
          1 పేతురు 4:19

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
నిత్య రాజ్యానికి వారసులవుదాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్

🙏 *CHRIST TEMPLE - PDTR* 🙏