✝️ CHRIST TEMPLE-PRODDATUR
- నీ అందమే నీ అతిశయమా..?
దేవుడు సృష్టించిన సృష్టి మహోన్నతమైనది, అత్యంత సుందరమైనది. ఆ సృష్టిలో స్త్రీ అందమైనది. అయితే, తన అందాన్ని ఇంకా యినుమడింప జేసుకోవడానికి తాను పడని తిప్పలంటూ ఏమి లేవేమో? చెప్పుకొంటూపోతే దానికి అంతమంటూ వుండదేమో? పరిశుద్ధ గ్రంథములో కూడా కొందరి స్త్రీల అందమును గూర్చి ప్రస్తావించబడింది. కానీ వారి అందమునుబట్టి కొనియాడబడిన స్త్రీ ఒక్కరూ లేరు సరికదా. అందము మోసము, అది వ్యర్థమని పరిశుద్ధ గ్రంధం ప్రభోధిస్తుంది.
*శారీరిక అందము*
👉 శారాయి చక్కనిది (ఆది 12:11)
👉 రిబ్కా మిక్కిలి చక్కనిది (ఆది 24:16)
👉 రాహేలు రూపవతి, సుందరి (ఆది 29:17)
👉 అబీగయీలు రూపసి (1 సమూ 25:3)
👉 బత్షెబ బహు సౌందర్యవతి (2 సమూ 11:3)
👉 వష్తి సౌందర్యవతి ( ఎస్తేరు 1:11 )
👉 ఎస్తేరు, అందమైన రూపము, సుందర ముఖమును గలది (ఎస్తేరు 2:7)
👉 యెమీమా, కెజీయా, కెరెంహప్పుకు (యోబు కుమార్తెలు) ఊజు దేశమంతటిలో సౌందర్యవతులు. ( యోబు 42:15)
*🤞అందము వ్యర్ధము:*
అందము మోసకరము. అది నిన్ను కొన్నిసార్లు శోధనకు గురిచెయ్యవచ్చు. అట్లా అని శోధించబడటం పాపం కాదు. శోధనలో పడడమే పాపం. అందముగా ఉండడం తప్పు కాదు, అందుకే దేవుడు నిన్ను అందముగా రూపొందించారు. అయితే, ఆ అందాన్ని చూచుకొని తప్పు చెయ్యడం పాపం. నీ అందానికి అంతరంగ సౌందర్యము జతకలిస్తే అది పరిపూర్ణమవుతుంది. షూలమ్మితి నల్లనిదైననూ బహు సౌందర్యవంతురాలు. ఆంతరంగిక సౌందర్యము లేని అందం వ్యర్థం. “అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము (సామెతలు 31:30) వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది. (సామెతలు 11:22)
*👌- ఆత్మ సంబంధమైన సౌందర్యము*
శరీర సంబంధమైన భౌతిక అలంకరణ ఖచ్చితంగా వేరొకరిని పాపమునకు ప్రేరేపించే అవకాశం వుంది. అంటే, నేరుగా నీవు పాపము చెయ్యకపోయినప్పటికీ, పాపము చెయ్యడానికి అవకాశం కల్పిస్తున్నావనే విషయం మరచిపోవద్దు. భౌతికమైన అలంకరణ కాదు ప్రభువుకు కావలసింది “అంతరంగ సంబంధమైన” అలంకరణ. “జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది”. (1 పేతురు 3:3,4). “దీనత్వము” అనే సుగుణాన్ని కలిగియుండడం ద్వారా రక్షణతో అలంకరింపబడగాలి. “యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును”. (కీర్తనలు 149:4)
*👍 -నీ అందం నిన్నెక్కడకి నడిపిస్తుంది?*
అందాన్ని బట్టి అతిశయించేవారు లెక్కలేనంతమంది. అయితే, అతిశయించేవారిలో నీవున్నావేమో సరిచూచుకో! సరిచేసుకో! వారిలో నీవుంటే, నీవు పాపములో వున్నావనేది నిస్సందేహం.
*🙆♂️-అందమును గూర్చిన అతిశయం నీలో ఉంటే?*
🔸అది నేరుగా నీతోనే పాపం చేయించొచ్చు
🔸వేరొకరిని పాపమునకు ప్రేరేపించొచ్చు
🔸నీ తోటివారిని నీ మనస్సులోనే చులకన చెయ్యొచ్చు, హేళన చెయ్యొచ్చు
🔸గర్వం నీ హృదయంలో తిష్ట వెయ్యొచ్చు
🔸ఆ గర్వమే నిన్ను పతనానికి నడిపించొచ్చు.
రాణియైన వష్తి తన సౌందర్యాన్ని బట్టి అతిశయించింది, చివరకు అధోగతి పాలయ్యింది. అయితే, శారాను ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా వేరొక రాజు కోరుకున్నాడు. అంటే ఆ వయస్సులో కూడా ఆమె ఎంత అందమైనదో కదా? అయితే, తన అందాన్ని బట్టి అందలమెక్కాలని భావించిన స్త్రీ కాదు. ఆమె కేవలం శారీరిక సౌందర్యవంతురాలు మాత్రమే కాదు, ఆమె సౌందర్యము అంతరంగికమైనది, అది ఆత్మీయమైనది.
నీ శారీరిక అందానికి ఆత్మీయ సౌందర్యాన్ని జతచేసి దానిని పరిపూర్ణము చెయ్యగలిగితే నీ జీవితం సార్ధకమైనదే. ఆంతరంగిక సౌందర్యము లేని అందం ఎట్లాంటిదంటే? డ్రైనేజీ లో పొర్లే పంది వంటిది. ఇది ఊహించుకోవడమే కష్టం కదా? అవును! శారీరిక అందం లేకపోయినా పర్వాలేదు. అట్లా అని నల్లగా ఉంటే, పొట్టిగా ఉంటే, లావుగా ఉంటే, సన్నగా ఉంటే నేనేదో అందముగా లేనని నీకు నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ సృష్టిలో నిన్ను పోలిన వారెవరూ లేరు. నీకు నీవే ప్రత్యేకం, నీ అందం ప్రత్యేకం. అందులనుబట్టి ప్రభువును స్తుతించు. శారీరిక అందం వున్నా అది వున్నా కొంత కాలమే కదా? ఆత్మీయ సౌందర్యము ఒక్కటి చాలు, అది శాశ్వత కాలం ప్రభువుతో నిన్ను జీవింపజేస్తుంది.
చివరిగా మరొక్కసారి చెప్తున్నాను శారీరిక అందమునుబట్టి కొనియాడబడిన స్త్రీ పరిశుద్ధ గ్రంధములో ఎవ్వరూ లేరు. ఈ లోకంలో కూడా లేరు. ఒకవేళ నీకు ఎవరైనా గుర్తొస్తే ఖచ్చితంగా వారు శరీరానుసారులే. దానిలో సందేహం లేనేలేదు. నిన్ను నీవు సరిచూచుకో! సరిచేసుకో! ఆంతరంగిక సౌందర్యము గలిగి అనునిత్యమూ ప్రభువుతో జీవించు! అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments