✝️ CHRIST TEMPLE-PRODDATUR
- దేవుడు మీ ఇంటిని విజిట్ చేయబోతున్నాడు..కనిపెట్టుకొని రెడీగా ఉండు..
సాధారణముగా మనము వేరే పనిమీద వెళ్తున్నప్పటికీ, మధ్యలో మనకు అత్యంత సన్నిహితులైనవారి గృహాలమీదుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు వారిని పరామర్శించి వెళ్లడమనేది సహజం. అట్లానే, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చెయ్యాలని బయలుదేరిన సందర్భంలో దారిలోనున్న అబ్రాహామును పలకరించి వెల్దామన్నట్లుగా అబ్రాహాము దగ్గరకు వచ్చిన సందర్భమిది. దేవుడే అబ్రాహామును పలకరించి వెళ్లాలనుకున్నారంటే దేవునికి, అబ్రాహాము ఎంతటి సన్నిహితుడయ్యాడో అర్ధం చేసుకోవచ్చు. ఆ సాన్నిహిత్యమే దేవునికి, అబ్రాహాము స్నేహితుడయ్యేటట్లు చేసింది.
దేవుడు అబ్రాహామును దర్శించిన సమయం “ఎండవేళ” (మధ్యాహ్నం) (ఆది 18:1). అది వృద్ధాప్యములోనున్న అబ్రాహాము విశ్రాంతి తీసుకొనే సమయం. కానీ, అబ్రాహాము నిద్రపోవడంలేదుగాని గుడారపు ద్వారమందు కూర్చొనివున్నాడట. మధ్యతూర్పు దేశాలలో మధ్యాహ్నసమయంలో ప్రయాణ బడలికచేత అసలి సొలసి దారిని వెళ్తున్న బాటసారులను వారింటికి పిలచి, త్రాగడానికి నీళ్లు, తినడానికి ఆహారము పెట్టడము ఆనవాయితీగా వుండేదట. అందుచే అబ్రాహాము అట్లాంటి వారికోసం ఎండవేళ తన గుడారమందు కూర్చొని ఎదురుచూస్తున్నాడు. అయితే, అబ్రాహాము ఏ దాసునికో ఆ పనిని అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవచ్చుకదా? లేదు అబ్రాహాము తన భాద్యతను విస్మరించేవాడు కాదు. ఇట్లా ఎదురుచూస్తున్న సందర్భములో అతడు ఊహించని అతిధి తనవైపు వస్తున్నట్లుగా చూచి, ఆయనెవరో గుర్తుపట్టి, తన గుడారమునుండి పరిగెత్తుకుని వెళ్లి ఆయనను (వారిని) ఎదుర్కొని, నేలమట్టుకు వంగి (సాష్టాంగపడి) తన ఆతిధ్యము స్వీకరించుటకొరకు వారిని బ్రతిమలాడుతున్నాడు. ఆయనెవరంటే “యెహోవా” (మొత్తము ముగ్గురు అయినప్పటికీ ఒకే పేరుతో పిలువబడడం ద్వారా త్రిత్వమును గమనించవచ్చు). 99 సంవత్సరాల వయస్సులో ఆయన దూరముననుండే గుర్తుపట్టగలిగాడు, ఆయనను ఎదుర్కోవడానికి పరిగెత్తుతున్నాడు, సాష్టాంగపడుతున్నాడు. దీనినిబట్టి దేవునికి అతడెంతటి విధేయుడో అర్ధం చేసుకోగలం. ఇట్టి అనుభవం మనకుందా?
🔅 1. అబ్రాహాము ప్రభువును చూచాడు:
ప్రభువును చూచే కన్నులు మనకున్నాయా? జక్కయ్య ఆయనెవరో చూడగోరి పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కెను( లూకా 19:3 ) ప్రభువును చూడకుండా అడ్డుపడే మనలోనున్న ఆ పొట్టితనము (పాపము) ఏమిటో సరిచేసుకోవాలి.
🔅 2. ప్రభువును గుర్తుపట్టాడు:
చూచిన వెంటనే ఆయనను గుర్తుపట్టగలిగాడంటే, దేవునితో అబ్రాహాము కలిగియున్న సంబంధ బాంధవ్యాలను అర్ధం చేసుకోగలం. సంవత్సరాల తరబడి, క్రైస్తవులముగానే చలామణి అవుతున్నాము. ప్రభువు స్వరాన్ని గుర్తుపట్టగలిగే అనుభవం మనలోవుందా? సంవత్సరాల తరబడి నీ హృదయమనే తలుపునొద్దనుండి తట్టుతూనే వున్నాడు (ప్రకటన 3:20) ఆయన మెల్లనైన స్వరముతో నిన్ను పిలచుచూనే వున్నాడు. రోదే అను చిన్నది పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది (అపో. 12:14). మరి నీవు ప్రభువు స్వరాన్ని గుర్తుపట్టావా?
🔅 3. ప్రభువును కలుసుకొనేందుకు పరిగెత్తుతున్నాడు:
ఆయన నావైపే వస్తున్నాడు కదా, వృద్ధాప్యంలోనున్న నేనెక్కడికి పోగలను అనుకోలేదు. తన వయస్సు తనకు గుర్తురాలేదు, శరీరం సహకరిస్తుందో లేదో పట్టించుకోలేదు. ప్రభువును చూచిన వెంటనే ఆనందముతో పరుగులు తీస్తున్నాడు. ఆయనను ఎదుర్కొంటున్నాడు. ఆదాము హవ్వలు ఏదెనులో ప్రభువును ఎదుర్కొనడానికి ధైర్యముచాలక, పారిపోయి చెట్లమధ్య దాగుకొంటున్నారు(ఆది 3:8) . ప్రభువును ఎదుర్కొనే ధైర్యం, అట్టి జీవితం మనకుందా? మధ్యాకాశములోనికి ప్రభువు మేఘారూరుడై రాబోవుచున్న వేళ, ఆయనను ఎదుర్కొనే సిద్దబాటు మనకుందా?
🔅 4. సాష్టాంగ పడుతున్నాడు:
అబ్రాహాము ఎంతగా తగ్గించుకొంటున్నాడంటే నీముందు నిలబడే అర్హతకూడా నాకు లేదంటూ సాష్టాంగ పడుతున్నాడు. సాష్టాంగపడుట ఆరాధనకు సాదృశ్యముగా వుంది. ఆయన ఏమైయున్నాడో అబ్రాహాముకు అర్ధమైనప్పుడు ఆయనను ఆరాధించకుండా వుండలేకపోయాడు. తన్నుతాను తగ్గించుకొంటూ దేవుని నామమును హెచ్చిస్తున్నాడు. మనమేమో దీనికి పూర్తి విరుద్దంగా, దేవునికంటే ఉన్నతంగా మనలను హెచ్చించుకునే ప్రయత్నం చేస్తున్నాము. లూసిఫర్ అట్లానే చేసాడు అదఃపాతాళానికి త్రోసివేయబడ్డాడు. మనలను మనము సరిచేసుకునే ప్రయత్నం చెయ్యాలి.
🔅 5. దేవుని హృదయాన్ని గ్రహించాడు:
కొంచెం నీళ్లు తెప్పించెదను కాళ్ళు కడుగుకొని చెట్టు నీడన అలసట తీర్చుకొనండి. కొంచెం ఆహారం తీసుకువస్తాను భుజించి మీ ప్రాణములను బలపరచుకొనండి. ఇందునిమిత్తమే కదా నా దగ్గరకు వచ్చారు?(ఆది 18:4,5) వారు కూడా అబ్రాహాము మాటలను గద్దించకుండా ఇందునిమిత్తమే అన్నట్లుగా, సరే నీవు చెప్పినట్లుగానే చెయ్యి అన్నారు. ఇక్కడ వారు చెప్పకుండా వారి హృదయాన్ని ఎరిగినవాడుగా అబ్రాహాము వున్నాడు. ఆయనతో సాన్నిహిత్యం వలన ఆయన హృదయాన్ని, ఆయన మనసును అర్ధంచేసుకోగలమనే విషయం అబ్రాహాము జీవితమునుండి నేర్చుకోగలము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము గ్రహించగలగాలి. అబ్రాహామునకు జరిగింది కేవలం శారీరిక సున్నతి మాత్రమేకాదు. అంతకు మించి గొప్పదైన హృదయ సున్నతికూడా జరిగిందని. లేనిపక్షంలో అతడు దేవుని హృదయాన్ని అర్ధం చేసుకొనివుండేవాడు కాదు.
మన ఇంటికి అతిధులు వచ్చినప్పుడు మనము చేయగలిగినంతలో ఎక్కువ మర్యాద చేస్తాము. కానీ, అబ్రాహాము దేవునిని చెట్టునీడను కూర్చోబెడుతున్నాడు. అంత అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడేమిటి? అవును మరి ఆయనింట్లో సోఫాసెట్స్, తివాచీలు, పట్టు పరుపులు ఇట్లాంటివేమీలేవు. ఆయనకంటూ ఒక శాశ్వతమైన గృహాన్ని కట్టించుకోలేదు. ఎందుకంటే ఈ లోకముగాని, ఆయన జీవితంగాని శాశ్వతం కాదని ఆయనకు తెలుసు. గుడారాల్లోనే నిరాడంబర జీవితాన్ని ఆయన జీవించాడు. చెట్టునీడనే ఆయనకు విశ్రమస్థానము ఏర్పాటు చెయ్యడం మంచిదనుకున్నాడు. నేటి మన బోధకులు ఏసీ కార్లు, ఏసీ రూమ్స్ వుంటేనే సువార్తకు వెళ్లే పరిస్థితి. మనము కూడా మన ఇండ్లను ప్రక్కనబెడితే, ఏసీ లేకపోతే దేవుని మందిరానికి వెళ్లలేని దయనీయమైన స్థితికి చేరుకున్నాము. మధ్యలో ఐదు నిమిషాలు కరెంటుపోతే, కాస్త ఫ్యాన్ ఆగిపోతే ఇక ఏదో ప్రళయమొచ్చినంత ఇబ్బంది పడిపోతాము. దేవుని మందిరంలో క్రింద కూర్చొని ఆరాధించే పరిస్థితులు లేవనే చెప్పాలి. పూర్తిగా విలాసాలకు అలవాటుపడ్డాము. మనకు మనముగా బ్రతికితే, అప్పులూ లేవు, తిప్పలూలేవు. గాని మనము మరొకరిలా విలాసవంతంగా జీవించాలను కొంటున్నాము. అనవసరమైనవన్నీ కొనుక్కొంటూపోయి, చివరికి అవసరమైనవన్నీ అమ్ముకోవాల్సిన స్థితికి చేరుతున్నాము. సంతృప్తిలేని జీవితాలు జీవిస్తున్నాము. కానీ, అత్యంత ధనికుడైన అబ్రాహాము నిరాడంబరముగానే జీవించాడు. ఆయన జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు ఒక గొప్ప సవాలు.
ప్రభువు నోటి మాట ద్వారా సృష్టించబడిన ఆ చెట్టు ప్రభువుకు నీడనిచ్చి, విశ్రమస్థానముగా ప్రభువుకు సేవచేసింది. అయితే, ఆయన చేతులతో, ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున నిర్మించబడిన నీవూ, నేనూ ఆయనకొరకు ఏమి చేయగలుగుతున్నాము? సృష్టినంతటిని మనకోసం సృష్టించి, మనలను మాత్రం ఆయన కోసం సృష్టించుకున్నాడు. మనమేమో సృష్టికర్తను విడచి సృష్టినే పూజించే దయనీయమైన స్థితికి దిగజారిపోయాము. 99 సంవత్సరాల వృద్ధుడు సాష్టాంగ పడుతున్నాడు. కనీసం ప్రభువు పాదాల చెంత మోకరిల్లే అనుభవమైనా మనకుందా? ఒక్కసారి మనలను మనమే పరిశీలన చేసుకొని, సరిచేసుకొని ఆత్మతో ఆరాధించే ఆరాధికులుగా జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
✝️ CHRIST TEMPLE-PRODDATUR
Comments