ఇదేంటి ! దుర్మార్గులే అభివృద్ధి అవుతున్నారు..?

🕎 CHRIST TEMPLE-PRODDATUR

Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu

ఇదేంటి ! దుర్మార్గులే అభివృద్ధి అవుతున్నారు..?

✴️ దేవుడు౼"నాకు విరోధంగా మీరు చాలా గర్వంగా మాట్లాడారు" "నిన్ను గూర్చి ఏమని మాట్లాడాం?"అని మీరు అడుగుతారు. "'దేవుణ్ని సేవించడం (సేవ చేయడం) వ్యర్ధం. ఆయన ఆజ్ఞలు పాటించి దేవుని సన్నిధిలో మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుతూ ఉండడంవల్ల ఏమి ఉపయోగం? గర్విష్ఠులే దీవెనలు పొందుతున్నారు, దేవుణ్ణి పరీక్షించే దుర్మార్గులు భద్రంగా ఉంటూ వర్ధిల్లుతున్నారు" అని మీరు చెప్పుకుంటున్నారు.

అప్పుడు యెహోవా పట్ల భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా ఆ మాటలు విన్నాడు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయన నామాన్ని గౌరవించే వారి గురించి జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధానంలో ఒక పుస్తకం రాశారు. "నేను నియమించే రోజు సమీపించినప్పుడు వారు నావారుగా, నా ప్రత్యేక సొత్తుగా ఉంటారు. తండ్రి తనను సేవించే కొడుకును కనికరించే విధంగా నేను వారిని కనికరిస్తాను" అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు. (మలాకి 3:13-17) ✴️

■ దేవుడు సర్వజ్ఞాని. ఆయన ప్రతి పని వెనుక ఒక నిర్దిష్టమైన ఉద్దేశ్యం ఉంటుంది. దేవుడు ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని పరిక్షిస్తాడు. (దీవెన/మేలుకు ముందు కాని లేదా దీవెన తర్వాత కాని). పరీక్షకు ముందు అందరూ ఒకే విధంగా కనిపిస్తారు(స్తుతిస్తారు) కానీ పరీక్ష అనంతరం మాత్రం దేవుడ్ని ప్రేమించేవారు మరియు దేవుని చేతిలో ఉన్న వాటినే ప్రేమించే వారుగా వేరు చెయ్యబడతారు. సహజంగా దేవుడు వివిధ విధాలుగా మనుష్యులను ఆయన సహవాసానికి పిలుచుకుంటాడు. కొన్నిసార్లు వ్యాధిభాధ బలహీనతలు, సూచక క్రియలు-మహత్కార్యాలు, సత్యానేషణ, మానసికంగా క్రుంగుదల మొ||. ఐతే దేవుణ్ని సేవించడంలో దీవెనలను ఆశించే వ్యక్తులు దేవుడు తమ భక్తికి పరిక్షపెట్టినప్పుడు తేలిపోతారు. వారు అన్యాయస్థులను, అవిశ్వాసులను లోకసంబంధమైన దీవెనలు పొందుకుంటున్నప్పుడు, వారి జీవితాల్లో ఆ మేలులు దొరకనప్పుడు 'మన భక్తి వల్ల ఏమి ప్రయోజనం, ఏమీ దొరకట్లేదు మన కంటే వాళ్లే నయ్యం' అనుకుని దేవునిపై తిరుగుబాటు చేస్తారు. తమ సొంత జీవితాలపై దేవుని యెలుబడి ఇష్టపడని, లోక సౌఖ్యల యందే మనస్సు పెట్టుకొను వారు, దేవుణ్ని అవసరానికి వాడుకునే ఒక యంత్రం లాగే చూస్తారు. వారు కోరుకున్నవి దొరికినంతకాలం భక్తిలో ఉంటారు, అవి దొరకనప్పుడు లోపల ఉన్న చెడిపోయిన వక్రబుద్దిని బట్టి దేవుని దూరమౌతారు. వారి స్వభావాన్ని బట్టి తిరిగి లోకంలో కలిసిపోతారు. పైన దేవుని వాక్యం చెప్పిన విధంగా దేవునికి కోపం పుట్టించి, నశించిపోయే వారిగా ఉంటారు.

■ కానీ కొందరు తాము ఏవిధం చేతనైనా దేవుని దగ్గరకు పిలువబడినప్పటికిని, అక్కడితో ఆగిపోక దేవుని శక్తిని చూసినవారై, యదార్థ హృదయులై దేవుడు ఎలాంటి వాడో, రక్షకుడు ఎందుకు వచ్చాడో, వాటిని గూర్చి వెలిగించబడి హత్తుకుంటారు. (ఇటువంటి మనస్సు గల వారిని దేవుడు జీవపు మాటలకు నడిపిస్తాడు) తర్వాత రోజుల్లో ఎన్ని లేమిలు ఉన్నా వారు దేవుణ్ని వదలరు. ఎందుకంటే వారు ప్రేమిస్తున్నది, వారి విశ్వాసం దేవుని చేతిలో ఉన్న వాటిపై కాదు గాని, దేవున్నే. ఈ విశ్వాసం బలమైనది, స్థిరమైనది మరియు నిష్కల్మషమైనది. దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకున్నవారు కదల్చబడరు. అంత్య దినాన దేవుడు వారి దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడడు. కొదువలతో దేవుడు వారిని పరీక్షించగా, వారు పలికిన విశ్వాస మాటలను దేవుడు భద్రం చేస్తాడు, ఒక రోజు వాటిని సమస్త మానవాళి ముందు బహిర్గతం చేస్తాడు. వారు దేవుని మంచితనాన్ని, శక్తిని తమకు అర్ధంకాని పరిస్థితుల్లో కూడా ఆయన్ను నమ్మి మహిమపర్చే వారిగా ఉంటారు.

■ మనుష్యులు దేవుని చేతిలో ఉన్న వాటినే ప్రేమించే వారుగా ఉండటానికి మరొక కారణం వారిని నడిపించిన భోధకులు! లోక కోరికలు తీరుతాయని, దేవుణ్ని నమ్మమని ఆశ చూపి పిలువగా, గుంపులు గుంపులుగా ప్రజలు దేవుని దగ్గరకు వస్తారు. అద్భుతాలు, సూచక క్రియల వంటి సాక్షాలతో ప్రజలను ఆకర్షిస్తారు. ఇలాంటి భోధకులు నేడు అనేకులు. క్రీస్తు, అపొస్తలులు ఎన్నడూ ఇలా పిలువలేదు. వారు దేవుని రాజ్యాన్ని గూర్చి మాత్రమే ప్రకటించారు. నిజంగా అవసరతల్లో ఉండి వచ్చిన ప్రతి ఒక్కరినీ దైవ చిత్తానుసారం మేలు చేశారు. దేవుని వాక్యాన్ని స్థిరపర్చడానికే ఈ సూచకక్రియలను దేవుడు వాడుకున్నాడు. 'దేవుని రాజ్యం' అంటే పరలోక పట్టణం అని కాదు గాని, దేవుడు ఏలే ప్రదేశం. అది మొదట మన హృదయం(జీవితం). భూమిపై మనలో దేవుని పరిపాలన లేకుండా దేవుని పట్టణం (పరలోకరాజ్యం) లోకి కూడా ప్రవేశించలేము.

కావున అన్యాయస్తులు , దుర్మార్గులు, గర్విష్టులు అభివృద్ధి అయ్యి.. మేడలు మిద్దెలు కడుతున్నప్పుడు, మనదగ్గర ఏమీ లేదని నిరుత్సాహ పడకుండా రాజులకు రాజు అయిన యేసయ్య మనతో వున్నాడని గ్రహించి , దేవుడు మనల్ని దీవించే సమయం కోసం నిరీక్షణ కలిగి , పరిపూర్ణ విశ్వాసంతో ప్రభువును మహిమపరుద్ధాం.

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.

CHRIST TEMPLE-PRODDATUR
Pastor. Nakkolla. Daniel Balu
☎ +91 8142229661

Comments